Vijay Sarathi

Saturday, August 15, 2009

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


శ్రీరస్తు శుభమస్తు వేదమంత్రాలు, మంగళవాద్యాలు ఒక వంక
చిలకమ్మదేమో గుర్లంక, జత కట్టింది బిట్రా వారి గోరింక
చిలక గోరింకలకన్నా ముచ్చటైన జంట కావాలి మీరింక
అన్యోన్యతలో లోకాన మీకు సాటి మరెవరూ లేరింక
సుఖ శాంతి సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం వర్థిల్లరా . . .

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


ఇన్నిరోజులు ఒకరిని విడిచి ఒకరు పాడుకున్నారు ఒంటరిగా విరహగీతం
ఫలించిన మీ వరాలతో కలసిన జంట స్వరాలతో మొదలయింది ఇక యుగళగీతం
సరదాల సరిగమలు, ఎదనసల పదనిసలు కలబోసిన సంసార సంగీతం
జతకూడి మీరు గతితప్పక శృతిలో ఆలపించే మరపురాని మధురగీతం
బ్రతుకంతా ప్రతినిముషం మధురగీతంలా ఆలపించరా . . .

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


నేను, నాది, నాకు - నీవు, నీది, నీకు అనే ఏకవచనాలు ఇక చెల్లు
మేము, మాది, మాకు - మావి, మనము, మనకు అనే పెళ్ళినాటి ప్రమాణాలు పోకూడదు పొల్లు
మమతానురాగాల మహిమతో కట్టుకుంటున్న మీ అందాల బొమ్మరిల్లు
అలుపెరుగక కురిపించాలి అంతులేని అమృతానందాల చిరుజల్లు
చిరుజల్లుల గుండె ఝల్లుల తనివితీరా తేలియాడరా . . .

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


ఒకరికోసం ఒకరు కురిపించేరు మమతానురాగాలు ప్రతినిత్యం
ఒకరి మీద ఒకరికి అప్యాయతేగాని చూపించరు ఆధిపత్యం
ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే నిత్య జీవిత సత్యం
ఇదే కదా వివాహబంధంలోని పవిత్ర మహత్యం
అంతులేని ప్రేమానురాగాల జీవితం మధురస్వప్నం చేసుకోరా . . .

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


ఊహలలో విహరిస్తూ చెప్పుకున్న ఊసుల
చేతిలో చెయ్యి వేసి చేసుకున్న బాసల
గున్నమామిడి గుబురుల్లో చెప్పుకున్న గుసగుసల
ఉడికించే అలకల్లో ఊరించే చిలిపి రుసరుసల
కలలు నిజం చేసుకుంటూ.. నరసాపురం నుండి సరసా పురానికి సాగిపోరా . . .

నాగేశ్వరా సంధ్యా హృదయ ప్రాణేశ్వరా


హృదయపూర్వక శుభాకాంక్షలతో . . .

- విజయ సారథి

0 Comments:

Post a Comment

<< Home